హెచ్-1బీ వీసా ఉద్యోగుల గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అయిన ‘పర్మ్’ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో సహా ఎనిమిది ప్రముఖ ఐటీ సంస్థలను ట్రంప్ సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ పరిణామం భారత ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ నిర్ణయంపై ప్రముఖ భారత ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ (Nasscom) స్పందించింది.
వలసలు, నైపుణ్యం కలిగిన నిపుణుల తాత్కాలిక బదిలీ రెండూ వేర్వేరు అంశాలని నాస్కామ్ స్పష్టం చేసింది. ఈ రెండింటినీ కలిపి ఒకే కోణంలో చూడటం సరికాదని పేర్కొంది. తాజా సస్పెన్షన్ కారణంగా పర్మ్ కింద కొత్త దరఖాస్తులు దాఖలు చేయడం సాధ్యం కాదని తెలిపింది. దీని ప్రభావం అమెరికాలో ఉపాధి అవకాశాలపై పడే ముప్పు ఉందని అభిప్రాయపడింది. అమెరికాలో తాత్కాలికంగా ఎదురయ్యే నిపుణుల కొరతను అధిగమించడానికి హెచ్-1బీ వీసా వ్యవస్థ ఎంతో కీలకమని గుర్తుచేసింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రోగ్రామ్ అమెరికా వ్యాపారాలకు ప్రయోజనకరంగా కొనసాగుతుందని వివరించింది.
అయితే గత కొన్నేళ్లుగా భారత ఐటీ సంస్థలు అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని బాగా తగ్గించాయి. అక్కడి స్థానిక నిపుణులకే ప్రాధాన్యమిస్తూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఈ మార్పు వల్ల పర్మ్ ద్వారా హెచ్-1బీ నుంచి గ్రీన్‌కార్డు వైపు మారే ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు చాలా పరిమితంగా ఉంది. భారత టెక్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో స్థానిక నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నాయి. అమెరికాలో ఎదురైన ఈ తాజా పరిస్థితులను కూడా భారత కంపెనీలు అక్కడి చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే సమర్థవంతంగా ఎదుర్కొంటాయని నాస్కామ్ ధీమా వ్యక్తం చేసింది.

