తెలంగాణలోని కరీంనగర్‌లో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది మరెవరో కాదు, స్వయంగా బాధితుడి సొంత అల్లుడు, మనవడేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను కరీంనగర్ సీపీ గౌష్‌ఆలం బుధవారం ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
నగరిలోని భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి అజ్మత్ అలీ నివాసంలోకి ఈ నెల 21న రాత్రి చొరబడిన దుండగులు, డమ్మీ పిస్టళ్లు, కత్తులతో కుటుంబ సభ్యులను బెదిరించి భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పరారైన విషయం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకున్నారు. అయితే ఈ దోపిడీకి పక్కా పథకం రచించింది బాధితుడి సొంత అల్లుడు రజావుద్దీన్, ఆయన కుమారుడు (బాధితుడి మనవడు) అజీమ్ రజాలుగా పోలీసులు గుర్తించారు.
కుటుంబ కలహాల కారణంగా రజావుద్దీన్ భార్య గత ఏడాది కరీంనగర్‌లోని తన పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేసుకోగా, అజ్మత్ అలీ కుటుంబం అతనికి వైద్యం చేయించి తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. కుమార్తె కాపురం బాగుపడాలనే ఉద్దేశంతో అతనికి వస్త్ర వ్యాపారం పెట్టించి ఆర్థికంగానూ అండగా నిలిచారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ మరింత డబ్బు కావాలంటూ భార్యను, మామను నిత్యం వేధించేవాడు. ఇటీవల రూ. 5 లక్షలు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేయగా, వారు నిరాకరించడంతో గొడవపడి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు వెళ్లిపోయాడు.
ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాల నిల్వలపై పూర్తి అవగాహన ఉన్న రజావుద్దీన్.. ఈ నెల 20న మళ్లీ కరీంనగర్‌కు వచ్చి తన కుమారుడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈ దోపిడీకి ప్లాన్ చేశాడు. దర్యాప్తులో భాగంగా యూపీలోని మేరఠ్‌కు చెందిన సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మొహమ్మద్ హసీన్‌లను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మేరఠ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రజావుద్దీన్, అజీమ్ రజా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ. 2.09 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
