జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 14న నిర్వహించాల్సిన సభను పార్టీ అధిష్టానం రద్దు చేసింది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి దశకు చేరుకున్నది. రేపటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనుండటంతో పార్టీ నాయకత్వం ఈ ప్రక్రియపై మరింత దృష్టి సారించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారు 8 లక్షల 70 వేల మంది జనసేన సభ్యత్వం పొందినట్లు వెల్లడించారు. ఈ సంఖ్యను ఇంకా పెంచాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ కంటే సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలాగే సభ్యత్వ నమోదు గడువును పొడిగించే అవకాశాన్ని కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరికొంత సమయం ఇస్తే ఇంకా ఎక్కువ మంది పార్టీ సభ్యత్వం పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొత్తంగా పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కీలకంగా తీసుకున్న జనసేన, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బేస్‌ను విస్తరించేందుకు ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా కొనసాగిస్తోంది.
