రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వైద్యారోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంది. రోగులను పట్టించుకోకుండా ఆసుపత్రిలో ఐటెం సాంగ్‌కు డాన్స్ చేసిన ఇద్దరు నర్సులపై అధికారులు సస్పెన్షన్ విధించారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు నర్సులు డ్యూటీ సమయంలోనే ఐటెం సాంగ్‌కు డాన్స్ చేస్తూ కనిపించారు. ఆసుపత్రిలో రోగులు చికిత్స కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైద్యారోగ్య శాఖ వెంటనే విచారణకు ఆదేశించింది.
విచారణ అనంతరం నర్సులు మెర్సీ మరియు ఈశ్వరీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారని అధికారులు నిర్ధారించారు. దీంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న మరో 16 మంది నర్సింగ్ సిబ్బంది కూడా విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించలేదని గుర్తించారు. వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరారు.
ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది రోగుల సేవను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమశిక్షణ, బాధ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
