నిజమైన ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థూరిలో విమర్శలు గుప్పించారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన జన చైతన్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సమీపంలో ఫార్మా సిటీ కోసం భూములు సేకరించామని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ పేరు మార్చి దాన్ని ‘ఫ్యూచర్ సిటీ’ అని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఫ్యూచర్ సిటీ అంటే అది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.

నిజమైన ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్ నగరం అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో వరంగల్‌కు కనీసం ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా అని ఆయన రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కొత్త పరిశ్రమలు తేవకపోగా, ఉన్న పరిశ్రమలను కూడా మూసివేస్తున్నారని మండిపడ్డారు.

వరంగల్ నగరాన్ని భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని కేటీఆర్ హామీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసగించిందని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన తెలిపారు.

భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ పర్యటనతో పార్టీ క్యాడర్‌లో జోష్ నిండింది. వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాటం మరింత ఉధృతం చేస్తుందని నేతలు స్పష్టం చేస్తున్నారు.