ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. కరీంనగర్ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో మాత్రం అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. జీవన్ రెడ్డి వర్సెస్ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అయితే తన పేరు కన్ఫార్మ్ కాకపోయినా ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేసులో ఉంటానంటూ ప్రకటించారు మరోవైపు జీవన్ రెడ్డి తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని లేని పక్షంలో పోటీలో ఉంటానని చెబుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదంటున్నారు.
దీంతో కరీంనగర్ పట్టభద్రుల ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై గంపెడాశాలు పెట్టుకోగా ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. ముఖ్యంగా నరేందర్ రెడ్డి తన మద్దతుదారులతో పాటు శిష్యులు, టీచింగ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఓట్లతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ టికెట్ కోసం ఏఐసీసీ పెద్దలను కలవడంతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు.
అయితే జీవన్ రెడ్డి సైతం తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పై స్పష్టమైన హామీ ఇస్తేనే పోటీకి దూరంగా ఉంటానని లేదంటే గెలుపుపై ప్రభావం చూపించడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని కాంగ్రెస్‌కు తప్పనిసరి కావడంతో జీవన్ రెడ్డి డిమాండ్‌ను నెరవేరుస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.