తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (స్టేట్ ఎలక్షన్ కమిషన్) ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈనెల 17 తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ విడుదలతో రాజకీయ పార్టీల్లో మరింత చురుకుదనం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కసరత్తు చేస్తోంది. వెనుకబడిన వర్గాలకు కేటాయింపుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్ల ఖరారు జరగనుంది.
అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి రెండో వారం లోపు ముగించేందుకు ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో, అన్ని ప్రధాన పార్టీలూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
