ఏపీ ఎన్నికల సమరం మాటల యుద్ధంతో తారాస్థాయికి చేరింది. గెలుపు తమదంటే తమదని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా గెలిచే స్థానాలు ఇవేనంటూ లెక్కలు కూడా చెబుతున్నారు నేతలు. అయితే ఓటరు మాత్రం ఎవరి వైపు ఉంటారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక ప్రధానంగా చిత్తూరు జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే 14 అసెంబ్లీ స్థానాల్లో 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో కొంతమంది అభ్యర్థుల పేర్లతో కూడిన వారు ఉండటం విశేషం. కూటమి పొత్తులో భాగంగా తిరుపతి నుండి జనసేన తరపున ఆరణి శ్రీనివాసులు బరిలో ఉండగా ఇక్కడి నుండే జాతీయ జనసేన పార్టీకి చెందిన ఆలూరి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటం విశేషం.
ఇక నగరిలోనూ ఇదే పరిస్థితి. వైసీపీ తరపున ఆర్కే రోజా పోటీ చేస్తుండగా స్వతంత్ర అభ్యర్ధిగా కే రోజా బరిలో ఉన్నారు.పలమనేరులో టీడీపీ సీనియర్ నేత అమరనాథరెడ్డికి అదే పేరు అమరనాథరెడ్డితో ఇద్దరు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.