ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ తనను కొట్టి, లైంగికంగా వేధించాడని.. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇండస్ట్రీలో తనను ఎదగనివ్వనని హింసించాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదుచేశారు.
జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు మహిళా కొరియోగ్రాఫర్. అవుట్ డోర్ షూటింగ్స్ లో జానీ మాస్టర్ తనపై పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
2017లో డీషోలో జానీ మాస్టర్ తో పరిచయం అయిందని, ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యానని తెలిపింది ఆ మహిళా కొరియోగ్రాఫర్. ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లగా అక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని తెలిపింది. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేసాడని జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది.