మరోసారి ఐపీఎల్‌ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్

బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌తో పాటు మరో ఆరుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఐపీఎల్ 2027 వేలానికి పేర్లు నమోదు చేసుకున్నారు. ముస్తాఫిజుర్‌తో పాటు నహిద్ రాణా, రిషద్ హొస్సేన్, హసన్ మహ్మద్, తౌహిద్ హృదయ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం ఈ జాబితాలో ఉన్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా ధృవీకరించింది.

గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరిగిన దాడులు, చెలరేగిన హింస కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ సూచన మేరకు కేకేఆర్ ఫ్రాంచైజీ అతడిని జనవరిలో విడుదల చేసింది.

అతడిని విడుదల చేయడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఆ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది.

గతంలో ఇలాంటి వివాదాలు, చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ, ఏడుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలానికి సిద్ధమవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, వేలంలో పేర్లు నమోదు చేసుకోవడం మాత్రమే ఒక దశ. ఫ్రాంచైజీలు వీరికి మద్దతుగా నిలిచి కొనుగోలు చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి. తుది జాబితాలో వీరికి చోటు దక్కుతుందో లేదో త్వరలోనే తేలనుంది.