హైదరాబాద్‌లో ‘సిగ్మా’ సినిమా విడుదలకు pre-release వేడుక అట్టహాసంగా జరిగింది. సందీప్‌కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ నాన్న ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగారని, ఆయన తనకెలాంటి సినిమాలిచ్చారో గుర్తుచేసుకున్నారు. అలాగే జాసన్ సంజయ్ కూడా దర్శకుడిగా అదే స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాసన్‌ని చూడగానే తనకు 90ల్లో విజయ్‌లాగే కనిపించాడన్నారు. యువతరం సినిమాలకు ప్రోత్సాహం అందించడమే తన బాధ్యతగా భావిస్తానని చిరంజీవి తెలిపారు.
దర్శకుడు జాసన్ సంజయ్ మాట్లాడుతూ.. ఇదొక చక్కటి యాక్షన్ అడ్వంచర్ సినిమా అని, ప్రతి ఒక్కరికీ ఇది కనెక్ట్ అవుతుందని చెప్పారు. తనను నమ్మి సినిమా చేసిన హీరో సందీప్ కిషన్, హీరోయిన్ ఫరియాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం తనలాంటి ఎంతోమంది కొత్త దర్శకులకు ఎనలేని ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. చిరంజీవి తమకు ఎప్పుడూ ఒక గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు. ఈ సినిమాను మొదట దుల్కర్ సల్మాన్ తో తీయాలనుకున్నారని, అయితే ఆయన బిజీగా ఉండటంతో తనను సంప్రదించారని చెప్పారు. ఇంతమంది హీరోలు ఉండగా తనను ఎందుకు ఎంచుకున్నావని అడిగినప్పుడు జాసన్ చెప్పిన సమాధానం విని తన పదహారేళ్ల కష్టానికి నిజమైన ఫలితం దక్కిందనిపించిందని తెలిపారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్‌తో పాటు నవీన్ ఎర్నేని, ఛోటా కె.నాయుడు, సాయిరాజేశ్, ఎస్.కె.ఎన్, లగడపాటి శ్రీధర్, మైత్రీ శశి తదితర ప్రముఖ సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

