ఏపీ ఎన్నికల రేసులో అధికార వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే బస్సుయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతుండగా విపక్ష టీడీపీ – జనసేన సైతం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసుకోగా ఇవాళ్టి నుండి ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పర్యవేక్షకులుగా రెండు పార్టీల సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
జిల్లాల వారీగా ఇప్పటికే ఇరు పార్టీల నుండి హాజరయ్యే వారి పేర్లు ఖరారు కాగా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం,పశ్చిమ గోదావరి కృష్ణా, చిత్తూరు, కడప,విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వరుసగా సమన్వయ సమావేశాలు జరగనున్నాయి.
అయితే ఇరు పార్టీల సమన్వయ సమావేశాల సంగతి అలా ఉంచితే అసలు సమస్య ఇప్పుడే మొదలుకానుంది. ఎందుకంటే పొత్తులో భాగంగా 30 స్థానాలు జనసేనకు కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ స్థానాలు ఇవేనని పలు పేర్లు ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుండగా ఇరు పార్టీల నేతల్లో టెన్షన్ మొదలైంది. పొత్తులో భాగంగా ఏ స్థానం ఎవరికి పోతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అందుకే ఇవాళ్టి నుండి జరిగే సమన్వయ సమావేశాల్లో రచ్చ జరగడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే పలువురు నేతలు అసంతృప్తిలో ఉండగా సీటు దక్కకపోతే తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఖాయం. ఈ నేపథ్యంలోనే సమన్వయం అంటూ కొత్త పల్లవిని ఎంచుకున్న అన్ని జిల్లాల్లో సమావేశాల తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.