ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద మహారాజ్ రాధా కేలీ కుంజ్ ఆశ్రమాన్ని సందర్శించినందుకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డబ్బులు తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ప్రతినిధులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు.
ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీకి రూ. 5 కోట్లు చెల్లించారని ఇటీవల కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ నేత దినేశ్ శర్మ (ఫలహారీ మహారాజ్) చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆశ్రమం పాపులారిటీ పెంచుకోవడానికే కోహ్లీకి డబ్బులు ఇచ్చి రప్పించారని ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణలను విరాట్ కోహ్లీ బృందం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని పేర్కొంది. ప్రేమానంద మహారాజ్‌పై ఉన్న అపారమైన గౌరవం, ప్రగాఢ భక్తి విశ్వాసాలతోనే కోహ్లీ స్వచ్ఛందంగా అక్కడికి వెళ్తారని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను రాసే ముందు మీడియా సంస్థలు వాస్తవాలను సరిచూసుకోవాలని సూచించింది.
విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ పలుమార్లు ఈ ఆశ్రమాన్ని సందర్శించి ప్రేమానంద మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు గతంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇటీవల ఇదే ఆశ్రమానికి చెందిన సాధువు రసిక్ దులారీ ఒక భవనం పైనుంచి అనుమానాస్పద రీతిలో పడి మృతి చెందడంతో ఆశ్రమం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఆ ఘటన మరువకముందే కోహ్లీ సందర్శనపై ఈ ప్రచారం మొదలైంది. దీనికి ఆయన బృందం ఇచ్చిన వివరణతో పుకార్లకు తెరపడింది.

