వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం రాబోతున్న సంగతి తెలిసిందే. కనీసం 2.9 కిలోమీటర్ల రన్‌వే ఉంటే కానీ పెద్ద విమానాలు, అంతర్జాతీయ విమానాలు (వైడ్ బాడీ) దిగడానికి వీలు కాదు. అలాంటప్పుడు కేవలం 2.5 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో వరంగల్ విమానాశ్రయం కట్టాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరంగల్ ఎయిర్‌పోర్టును 3.9 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో కట్టాలని ప్రతిపాదించారు. అలా కట్టి ఉంటే ప్రపంచంలోని అతి పెద్ద విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉండేది. వరంగల్ ఎయిర్‌పోర్టు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టులో కూడా రన్‌వే పొడవు 2.9 కిలోమీటర్లు ఉంటుంది అని స్పష్టంగా పేర్కొన్నారు.
తీరా ఈ వారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కింజరపు రాం మోహన్ నాయుడు సమావేశమయ్యి అనంతరం ఇచ్చిన ప్రకటనలో ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు 2.5 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. అంటే దీనర్ధం వరంగల్ ఎయిర్‌పోర్టు కేవలం చిన్న డొమెస్టిక్ విమానాలు మాత్రమే దిగేందుకు వీలుగా ఉంటుంది. పెద్ద డొమెస్టిక్ విమానాలు కానీ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కానీ నడపడానికి ఈ రన్‌వేతో వీలు కాదు.
ఈ విషయం తెలిసినప్పటి నుండి వరంగల్ నెటిజెన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో వందేళ్ళ క్రితం కట్టిన హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులోనే 3.2 కిలోమీటర్ల రన్‌వే ఉంది.ఇక 2008లో మొదలైన శంషాబాద్ విమానాశ్రయం రన్‌వే ఏకంగా 4.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పక్క రాష్ట్రంలోని విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు 3.36 కిలోమీటర్లు ఉండగా వైజాగ్ విమానాశ్రయంలో రన్‌వే పొడవు 3.0 కిలోమీటర్లు ఉంది.
వరంగల్ ఎయిర్‌పోర్టు రన్‌వే – 2.5 కి.మీ.
బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే – 3.2 కి.మీ.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వే 4.2 కి.మీ.
విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే 3.36 కి.మీ.
