ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు పాలనలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందని వైయస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ప్రముఖ దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు అని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఉన్న పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమకు తాము అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణమని జగన్ మండిపడ్డారు. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్టను కూడా దిగజార్చే హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఆ పోస్టుల తొలగింపు అభ్యర్థన నిజంగా ఎఫ్‌బీఐ నుంచి కాకుండా, ఏపీ పోలీసుల అధికారిక ఈ-మెయిల్ చిరునామా నుంచే వచ్చిందని ఎక్స్ సంస్థ ధృవీకరించిందని తెలిపారు. అయినప్పటికీ ఆ మెయిల్ పంపిన సంబంధిత అధికారి తాను ఎఫ్‌బీఐ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
అసలు ఆ అభ్యర్థన పంపాలని అధికారులను ఆదేశించింది ఎవరు? అక్కడ ఎఫ్‌బీఐ పేరును ఎందుకు దుర్వినియోగం చేశారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు, ఎక్స్ సంస్థను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అమలు చేయని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలపై వస్తున్న విమర్శలను తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.
పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి మాత్రమే ఉపయోగపడాలి తప్ప, రాజకీయ సెన్సార్షిప్ను అమలు చేయడానికి కాదని జగన్ హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును వాడటం ఆంధ్రప్రదేశ్‌కు తీరని అవమానమని, దీనివల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని, ఎన్నికల హామీల అమలుకు, కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఉపయోగించాలని హితవు పలికారు.

