ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు 51 శాతానికి పైగా వర్షపాతం లోటు ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని 688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం లోటు నెలకొందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని జగన్ మండిపడ్డారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో జరగాల్సిన ఖరీఫ్ సాగు కేవలం 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని చెప్పారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో కనీసం విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కరువు ప్రభావిత మండలాలను వెంటనే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని కోరారు. విత్తనం వేయలేని రైతులకు ఎకరాకు రూ.15 వేలు, పంట నష్టపోయిన వారికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద సుమారు రూ.6 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు అదనంగా 150 రోజులు ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు.
రైతులకు అండగా నిలిచేందుకు పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాలని జగన్ పిలుపునిచ్చారు. త్వరలోనే తాను కూడా కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. మండల, నియోజకవర్గ స్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేసి ప్రభుత్వ విధానాలపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

