‘కార’ (Kara) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘పెద్ది’ (Peddi) చిత్రం జూన్ 25న థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. ఈ అనూహ్య ప్రకటన రామ్ చరణ్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. విడుదల తేదీ గురించి క్లారిటీ రావడంతో, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అఫీషియల్ రిలీజ్ డేట్ పోస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా పోస్టర్ వస్తేనే ఆ తేదీ అధికారికంగా ఖరారైనట్లు భావిస్తారు. ఈ అప్‌డేట్ ఆదివారం నాడు ముందస్తు సమాచారం లేకుండా రావడంతో, సోమవారం కొత్త పోస్టర్ విడుదలవుతుందని చాలామంది ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇతర సినిమాలతో పోటీ (Clashes) లేకుండా ఉండాలంటే, పోస్టర్ త్వరగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
‘పెద్ది’ పాన్-ఇండియా చిత్రం కావడంతో, పోస్టర్ విడుదల ద్వారా ఇతర సినీ పరిశ్రమల వారికి కూడా విడుదల తేదీపై స్పష్టత వస్తుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
