నెల్లూరు రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన కుటుంబం ఎవరంటే ఆనం వారు అని ఠక్కున ఎవరైనా చెబుతారు. తమ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్న ఆనం బ్రదర్స్ ఇటీవల హస్తాన్ని విడిచి సైకిల్ ఎక్కారు. భవిష్యత్తులో కాంగ్రెస్ వచ్చే పరిస్ధితి లేదని, చంద్రబాబు తోనే ప్రస్తుత పరిస్ధితుల్లో ఏపీ అభివృద్ది సాధ్యమవుతుందని ఆనం సోదరులు తెలిపారు.
పదవుల కోసమే ఆనం సోదరులు టీడీపీలో చేరారని విమర్శలు వస్తే, తమ కుటుంబానికి పదవులేమీ కొత్త కాదని, తాము పదవుల కోసం టీడీపీలో చేరలేదని వారు చెప్పుకొచ్చారు. కానీ వారు టీడీపీలో చేరడం వెనుక ఆనం బ్రదర్స్ మంచి స్కెచ్చే వేసినట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా పనిచేస్తున్న యనమల రామకృష్ణుడికి ఆనం రాంనారాయణ రెడ్డి ఎసరు పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం ఇప్పుడు అదే పదవికి కోరుకొని టీడీపీలో చేరినట్లు సమాచారం. మరోవైపు యనమల కూడా తాను ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి,
ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న పెద్దల సభలో అడుగు పెట్టాలనే కోరికను తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నారట. ఒకవేళ ఇదే జరిగితే నెల్లూరులో సోమిరెడ్డి లాంటి సీనియర్ నేతలు ఊరికే ఉంటారా? అన్న సందేహాలు వినవస్తున్నాయి