కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు అని తేల్చిచెప్పారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించాం అన్నారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందని.. మల్లన్న చేసిన వాఖ్యలు చాలా తప్పు అన్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం అని తేల్చిచెప్పారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు మల్లన్న. తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అంతేగాదు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన బీసీ కులగణనపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ కులగణన పత్రాలను లైవ్లోనే కాల్చేశారు.కులగణన తప్పుల తడక అని కావాలనే బీసీల సంఖ్యను తగ్గించారని విమర్శలు చేశారు.

