ఈసీ కి ఏపీ ప్రభుత్వానికి మధ్య వార్ తప్పడంలేదు. ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను సీఈసీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవోలో ఇంటిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పిస్తూ జీవో జారీ చేసింది.ఈ జీవో ప్రకారం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సీఈసీ పరిధిలోకి రానున్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు సీఈసీ పరిధిలోనే పోలీసులు ఉంటారు.
కేంద్రం ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తరువాత ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బదిలీ చేయడాన్ని తప్పుబడుతున్న ఏపీ ప్రభుత్వం… దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. సీఈసీ ఆదేశాలతో వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను రిలీవ్ చేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 విడుదల చేసింది. తెల్లారేసరికి ప్లేటు ఫిరాయించింది ప్రభుత్వం. నిన్న విడుదల చేసిన 716 జీవో ను రద్దు చేస్తూ నేడు వివాదాస్పద జీవో 720 జారీ చేసింది. ఇవాళ్టి జీవోలో వెంకటేశ్వరరావు పేరును తప్పించింది. ఆయనను రిలీవ్ చేయడం లేదని.. శ్రీకాకుళం, కడప ఎస్పీలను మాత్రమే రిలీవ్ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. ఈ నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

