ఏపీ సర్కారు అట్టహాసంగా పల్స్ సర్వే ని మొదలు పెట్టింది . చంద్రబాబు ఇంటి నుంచే స్వయంగా సర్వే చెప్పట్టడం తో ఈ సర్వే హడావిడి నాంది మొదలైంది. ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రజలకి సంబంధించిన అన్ని అంశాలూ తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు చంద్రబాబు ఉద్యోగులకి ఆదేశాలు జారీ చెయ్యగా ఇది సాగుతోంది.
జనగణన కంటే ఈ పల్స్ సర్వే చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది అని చంద్రబాబు ధీమాగా చెప్పారు. కానీ క్షేత్ర స్థాయి లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందట. ప్రజలలోకి తీసుకుని వెళుతున్న ఎన్యూమరేటర్ లు అసలు పనిచెయ్యకపోవడం తో అనుకున్న ప్రకారం సర్వే జరగట్లేదు. నిజానికి ఈ సర్వే అనుకున్న దగ్గర నుంచే ప్రజల్లో రకరకాల అనుమానాలు వ్యక్తం కావడం మొదలైంది.
ఇంతకీ ఈ సర్వే ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నట్టు అనేది పెద్ద ప్రశ్న? సర్వే అధికారులు మీ ఇంటికి వచ్చేలోగా దాదాపు 20 రకాల డాక్యమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్‌బుక్‌లు, ఇళ్ల దస్తావేజులు, ఆస్తుల పత్రాలు… ఇలా అన్నీ అడిగేసరికి ప్రజల్లో ఆందోళన మొదలైంది. అన్ని రకాల పత్రాలు ఇప్పటికిప్పుడు తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామన్న ఆవేదన వ్యక్తం అయింది.
ఈ సర్వే నిర్వహణ ఏ విధంగా ఉండబోతోంది అనేది ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.