మన దేశంలో బాలల దినోత్సవం నవంబర్ 14వ తేదీన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మ దినోత్సవం రోజు నిర్వహిస్తున్నారు. అయితే బాలల దినోత్సవం నాడు బాలల హక్కులు, సంక్షేమం గురించి మాట్లాడకుండా నెహ్రూ గురించే మాట్లాడుతున్నట్లు బీజేపీ ఎంపీలు భావిస్తున్నారు. ఆ రోజు బాలల దినోత్సవంగా ప్రకటించినా బాలల విషయంపై చర్చకు రావడం లేదని గ్రహించిన బీజేపీ ఎంపీలు డిసెంబర్ 26వ తేదీన బాలల దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై వంద మందికి పైగా బీజేపీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నవంబర్ 14వ తేదీన బాలల సంక్షేమం కంటే జవహర్‌లాల్ నెహ్రూకు చిన్నారులపై ప్రేమ గురించిన ప్రస్తావనే అధికమవుతోందని వారు ఆరోపించారు. అందుకే జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14వ తేదీని ‘అంకుల్ డే’ లేదా ‘చాచా దివస్’గా జరపాలని లేఖలో ప్రధానిని కోరారు.
ఇక బాలల దినోత్సవం డిసెంబర్ 26వ తేదీన జరపాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మొఘలులకు వ్యతిరేకంగా గురు గోవింద్ సింగ్ కుమారులు షహిజద అజిత్ సింగ్ (18), జుజార్ సింగ్ (14), జోర్వార్ సింగ్ (9), ఫతే సింగ్ (7) చిన్న వయసులోనే చేసిన ప్రాణ త్యాగానికి ప్రతీకగా డిసెంబర్ 26వ తేదీన బాలల దినోత్సవం నిర్వహించాలని లేఖలో కోరారు. గురు గోవింద్ సింగ్ కుమారుల బలిదానాల స్ఫూర్తిని చిన్నారుల్లో నింపేందుకు డిసెంబర్ 26వ తేదీని బాలల దినోత్సవంగా చేయడం సముచితమని భావిస్తున్నారు.