నిజాయితీగా పనిచేసె అధికారులకు స్థాన చలనాలు తప్పవు. ముక్కుసూటిగా ఉండే వారికి తిప్పలు తప్పవన్న విషయం తాజాగా మరోసారి రుజువైంది. అధికారలంలోకి వస్తే అవినీతిని రూపుమాపుతాం అని ప్రగల్భాలు పలికే నాయకులు వారు అధికారంలోకి రాగానే తమ రాజకీయ బుద్దిని చూపిస్తారు. పవర్లో ఉన్నా ముక్కుసూటి అధికారులపై బదిలీ వేటు తప్పదన్న వైనం స్పష్టమైంది.
తాజాగా నిజాయితీగా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ తన 27 ఏళ్ల సర్వీసులో 52 ట్రాన్స్ ఫర్లు ఎదుర్కొన్నారు. 1991 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా తాజాగా మరోసారి బదిలీ అయ్యారు. ప్రస్తుతం హర్యానాలో క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఖేమ్కాను ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ ఫర్ చేసింది.
2012లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు.. డీఎల్ఎఫ్ కు మధ్య కుదిరిన భూ ఒప్పందం విషయంలో తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి.వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య ఒప్పందాన్ని ఆయన రద్దు చేయడంతో ఖేమ్కా ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన హర్యానా క్రీడల విభాగంలో 15 నెలలు మాత్రమే పనిచేసినా తనదైన ముద్ర వేశారు.ముక్కుసూటిగా పని చేసే అధికారిని ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా భరించలేదన్న విషయం తాజా బదిలీతో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు. నిజాయితీతోపాటు.. కచ్ఛితమైన నిర్ణయాలు తీసుకునే సత్తా అశోక్ కు టన్నుల లెక్క ఉందని.. అందుకే ఆయనపై తరచూ బదిలీ వేటు పడుతుందని చెబుతుంటారు. అంకిత భావంతో పని చేసే ఆయనకు ట్రాన్సఫర్లు బహుమానాలు వస్తుంటాయన్న పేరుంది.