జమ్మూకాశ్మీర్ బందిపోరా జిల్లాల్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పక్కింట్లో ఉండే మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి బాలిక జీవితాన్ని చిదిమేశాడు ఓ కామాంధుడు. దీంతో అక్కడ బందిపోరాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చిన్నారిపై అత్యాచార ఘటన తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బందిపోరాలో కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ ఘటనపై జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు.
చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై షరియా చట్టాల ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబల్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వినడానికే తనకు సిగ్గుగా ఉందని, లైంగిక దాడి ఘటనలపై కొందరు మహిళలే నిందితులను ప్రేరేపించేలా వ్యవహరిస్తారని సమాజం తరచూ నిందిస్తుందని మరి ఈ చిన్నారి ఏం తప్పు చేసిందని మెహబూబా ముప్తీ ప్రశ్నించారు. ఇలాంటి వారిని షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని కోరారు.

చిన్నారిపై అత్యాచారం జరిగిన మాట వాస్తవమేనని పోలీసులు ప్రకటించారు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు. చిన్నారిపై లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.