జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన ఎన్నికల మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్‌తో పాటు పార్టీ సిద్దాంతాలను కూడ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మ వారిని పవన్ ఈ రోజు దర్శించుకున్నారు. అనంతరం విజన్ డాక్యుమెంట్ ను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు ‘జనసేన’ ట్విట్టర్ లో ఈ విజన్ డాక్యుమెంట్ ను పొందుపరిచారు. మేనిఫెస్టోలోని కొన్ని మచ్చుతునకలంటూ 12 హామీలతో పాటు 7 సిద్ధాంతాలను పొందుపర్చారు.
జనసేన మ్యానిఫెస్టో ముఖ్యాంశాలు…
హామీలు..
మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు
గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ.2,500 రూ.3,500/ వరకు నగదు
బీసీలకు అవకాశాన్ని బట్టి 5 % రిజర్వేషన్లు పెంపుదల
చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతి గృహాలు
ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు
సిద్ధాంతాలు..
కులాలను కలిపే ఆలోచనా విధానం
మతాల ప్రస్తావన లేని రాజకీయం
భాషలను గౌరవించే సంప్రదాయం
సంస్కృతులను కాపాడే సమాజం
ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
అవినీతిపై రాజీలేని పోరాటం
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం