కార్గిల్ యుద్ధంలో పాకిస్తానే విజయం సాధించిందటూ.. అసందర్భ ప్రేలాపన చేసిన పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడికి భారత ప్రభుత్వం ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ముషార్రఫ్ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూనే.. భారత ప్రభుత్వం ఆయనకు గట్టి మాటతో రియాక్షన్ ఇచ్చింది. 1999 సమయంలో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో ముషార్రఫ్ మిలటరీ అధినేతగా ఉండేవాడు. ఆ యుద్ధంలో పాక్ తోక ముడిచింది.
ఇదంతా గడిచిపోయి ఒకటిన్నర దశాబ్దం గడిచిపోయినట్టే. అయితే.. ఇప్పుడు ముషార్రఫ్ కొత్త మాట మాట్లాడాడు. కార్గిల్ యుద్ధం సమయంలో పాక్ సైన్యం చాలా దూకుడుగా ముందుకు వెళ్లిందని… కాశ్మీర్ లో చాలా ప్రాంతాన్ని ఆక్రమించిందని చెప్పుకొచ్చాడు. ఈ విధంగా పాక్ ఇండియాపై పై చేయి సాధించిందని అన్నాడు. అయితే అప్పట్లో పాకిస్తానే తోకముడిచి వెళ్లిపోయిన విషయాన్ని ముషార్రఫ్ దాచి పెడుతున్నాడు.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తరపున రక్షణాశాఖ సహాయ మంత్రి ఒకరు స్పందించారు. ముషార్రఫ్ మాటలు మతిభ్రమించిన వ్యక్తి మాట్లాడుతున్నవిలా ఉన్నాయని ఆయన అన్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో ముషార్రఫ్ రక్తం గక్కుకొన్నాడని.. అది ఆయనకు కూడా తెలుసని.. అయితే ఇప్పుడు ఇలా విడ్డూరంగా మాట్లాడుతున్నాడని.. ఆయన స్థాయి వ్యక్తి మాటలకు స్పందిచాల్సిన అవసరం కూడా లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మరి ముషార్రఫ్ స్థాయి వ్యక్తి మాటలకు ఈ స్పందన చాలేమో!