- Advertisement -

ప్రియుడి బ్లాక్‌మెయిలింగ్‌.. వదినను చంపిన మరదలు!

- Advertisement -

అక్ర‌మ సంబంధాల మోజులో కొంద‌రు.. ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారనే దానికి నిదర్శనంగా కర్ణాటకలో ఒక భయంకరమైన ఘ‌ట‌న‌ వెలుగుచూసింది. లగ్జరీ జీవితానికి, అక్రమ సంబంధానికి అలవాటుపడి.. డబ్బుల కోసం వదిననే ప్రియుడితో కలిసి గొంతు కోసి హతమార్చింది ఒక మరదలు. ఆపై దొంగలు పడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ పెప్పర్ స్ప్రే డ్రామాలతో పోలీసులను నమ్మించాలని చూసి, చివరకు దొరికిపోయింది. ఈ కిరాతక ఘటన చిక్కబళ్లాపురం నగరంలోని బాపూజినగరలో కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. మే 28వ తేదీ అర్ధరాత్రి మేస్త్రి నరసింహమూర్తి ఇంట్లో కోడలు పుష్పలత గొంతు కోసి హత్యకు గురైంది. ఆమె పక్కనే పడుకున్న మరదలు భవ్య.. దొంగలు తన నోట్లో బట్టలు కుక్కి, పెప్పర్ స్ప్రే కొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని పోలీసులకు కథ చెప్పింది. అయితే, పుష్పలత తల్లిదండ్రులు మాత్రం అత్తగారింటి వారిపైనే అనుమానం వ్యక్తం చేశారు. మొదట్లో దీనిని దోపిడీ కేసుగా భావించిన పోలీసులు.. ఆసుపత్రిలో ఉన్న భవ్యను విచారించగా ఆమె మాటల్లో పొంతన కుదరకపోవడంతో అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేశారు.

జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె పర్యవేక్షణలో సాగిన ఈ దర్యాప్తులో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భవ్యకు వివాహమైనప్పటికీ, తన భర్త స్నేహితుడైన కార్ డ్రైవర్ లోహిత్‌కుమార్ లల్లుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, లల్లు ఆమె ప్రైవేట్ వీడియోలను బయటపెడతానని బెదిరిస్తూ భవ్య నుండి ఇప్పటికే రూ. 5 లక్షలు వసూలు చేశాడు. మరింత డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో.. తన వదిన పుష్పలత వద్ద ఉన్న బంగారు నగలను దోచుకోవడానికి ఆమెను హత్య చేయాలంటూ భవ్యనే స్వయంగా ప్రియుడికి ఐడియా ఇచ్చింది. మే 28వ తేదీ రాత్రి సమయం అనుకూలంగా ఉంటుందని ప్లాన్ చెప్పింది.

హ‌త్య జ‌రిగిన‌ ఆ రాత్రి వదిన పక్కనే పడుకున్న భవ్య, లల్లు రాగానే ఇంటి తలుపులు తీసింది. ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న పుష్పలతను దిండుతో అదిమిపట్టి, కత్తితో గొంతు కోసి కిరాతకంగా చంపేశారు. అనంతరం నగలతో లల్లు పరారవ్వగా.. భవ్య దొంగల నాటకమాడింది. కానీ, ఆ రోజు ఇంటి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పోస్టుమార్టం నివేదికలో అది హత్యని తేలడంతో పోలీసులు భవ్యను తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది. పోలీసులు భవ్యతో పాటు ప్రియుడు లల్లును అరెస్ట్ చేశారు. ఈ కేసులో అత్తమామల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -