కర్నూలు జిల్లాలో ఒక విస్మయం కలిగించే నేర ఉదంతం వెలుగుచూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే ప్రియుడితో కలిసి కిరాతకంగా చంపేసింది ఒక తల్లి. ఆపై ఏమీ తెలియనట్లు కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా పోలీసులపై ఒత్తిడి తేవడానికి ఏకంగా హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. చివరకు ప్రత్యేక దర్యాప్తులో ఆమె చేసిన ఘోరం బయటపడిన కొద్దిసేపటికే.. సదరు మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన గంగమ్మ అనే మహిళకు, ఆమె బంధువు దర్గప్పతో వివాహేతర సంబంధం ఉంది. దర్గప్ప తరచూ ఇంటికి రావడం గంగమ్మ పెద్ద కుమారుడైన వీరేశ్ (17) కు నచ్చలేదు. దీంతో అతను పలుమార్లు గొడవపడ్డాడు. తమ బంధానికి అడ్డు వస్తున్నాడని కక్ష పెంచుకున్న గంగమ్మ, దర్గప్పలు కలిసి 2024 నవంబరులో వీరేశ్‌ను ఇంట్లోనే కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి, బైక్‌పై తీసుకెళ్లి సమీప శ్మశానవాటికలో పాతిపెట్టారు. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ గంగమ్మే స్వయంగా కౌతాళం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా ఆడింది.
అయితే, హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయనే ఆశతో.. పోలీసులు తన కొడుకు కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదంటూ గంగమ్మ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన కోర్టు, రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించడంతో.. ఈ కేసు కోసం ప్రత్యేకంగా సిట్ (SIT) బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు లోతుగా ఆరా తీయడంతో గంగమ్మ, దర్గప్పల కిరాతకం బయటపడింది. ఆదివారం పోలీసులు శ్మశానవాటికలో పాతిపెట్టిన వీరేశ్ అస్థిపంజరాన్ని బయటకు తీశారు. అక్కడ దొరికిన వస్తువుల ఆధారంగా అది వీరేశ్‌దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు.
ఇదిలా ఉంటే, నిజా నిజాలు బయటపడిన ఆదివారం నాడే ప్రధాన నిందితురాలైన గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఇది లాకప్ డెత్ అయ్యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆమె మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేసి, ప్రస్తుతం దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో మరో నిందితుడైన ప్రియుడు దర్గప్పను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
