కేరళలో ప్రేమ పేరుతో జరిగిన ఒక దారుణ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడిని వదిలించుకోవడానికి 19 ఏళ్ల యువతి వేసిన ప్లాన్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. స్నేహితుల సహాయంతో ప్రియుడిని కిడ్నాప్ చేసి, దోపిడీకి పాల్పడటమే కాకుండా హత్య చేసేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేశారు.
పట్టాంబికి చెందిన ఒక యువకుడు తన ప్రియురాలిని కలవడానికి అర్ధరాత్రి సమయంలో కేరళలోని తిరుర్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే, అప్పటికే ఆ యువతి తన ప్రియుడిని ఎలాగైనా అంతం చేయాలని పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంది. అతను తిరుర్ చేరుకోగానే, యువతికి పరిచయస్తుడైన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. తన స్నేహితుడి వద్దకు తీసుకెళ్తానని నమ్మించి అతడిని బైక్పై ఎక్కించుకున్నాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మరికొందరు దుండగులు మార్గమధ్యలో చేరారు. వారంతా కలిసి ఆ యువకుడిని బలవంతంగా ఒక కారులోకి ఎక్కించారు. అనంతరం అతడిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు.
తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో అతడిని చంపాలని నిందితులు నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తాజెపళం వద్ద ఉన్న నదీతీర ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. అతను చనిపోయి ఉంటాడని భావించి రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే, తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. తేరుకున్న తర్వాత నేరుగా పోలీసులను ఆశ్రయించి తన ప్రియురాలి కుట్రపై ఫిర్యాదు చేశాడు. తిరుర్ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రియురాలితో పాటు ఇర్షాద్, అసారుద్దీన్ సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరిపై ఇదివరకే డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యాయత్నం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు వీరికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

