సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు.. తమ కంటూ వ్యక్తిగత ఇమేజ్ తో సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారు.. సామాన్యుల దృష్టిలో చాలా ఉత్తములు.. అయితే వీరి వ్యవహరణ తీరు మాత్రం సరిగా లేదు. అచ్చంగా వీరు రౌడీల్లా వ్యవహారిస్తున్నారు. వ్యక్తిగతంగా కాకపోయినా కొంతకాలం క్రితం రామ్ చరణ్ తేజకు సంబంధించిన వివాదం, ఇప్పుడు మోహన్ బాబు ఇంటి ముందు జరిగిన గలాలా సదరు సెలబ్రిటీలకు రౌడీ ఇమేజ్ ను తెచ్చిపెడుతోంది.
సినిమా వాళ్లంటేనే చీదరించుకొనేందుకు కారణం అవుతున్నాయి ఈ ఘటనలు.
హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణ ఏరియాలో కొంతకాలం క్రితం రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరి యువకులకు చితక్కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఏదో చిన్న గొడవను పెద్దదిగా చేసి చరణ్ సిబ్బంది వారిని రోడ్డుపైనే చితకబాదింది. సంఘటన స్థలంలో చరణ్ తన కారును నిలబెట్టుకోవడం.. జరిగిన తతంగాన్ని వేడుకగా చూడటం పలు విమర్శలకు దారి తీసింది. అవతల వారిదే తప్పు అయితే.. దాన్ని పరిష్కరించుకొనే తీరు అది కాదు.
ఇక ఇప్పుడు మోహన్ బాబు వంతు. ఈ హీరో గారి ఇంటి ముందు ఇది కొత్త గొడవ కాదు. గతంలో “దేనికైనా రెడీ’ సినిమా వివాదం సమయంలో కూడా పెద్ద గొడవే జరిగింది. అప్పట్లో మోహన్ బాబు భద్రత సిబ్బంది బ్రహ్మణ సంఘం వారిపై దాడి చేసింది. మరో ఆలోచన లేకుండా తీవ్రంగా సాగింది ఆ దాడి. ఇప్పుడు మోహన్ బాబు ఇంటి ముందు నిలబడి ఉన్న ఒక వ్యక్తిపై కూడా ఇలాంటి దాడే జరిగింది. మరి దీనికి కారణాలు ఏమైనా.. సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇలా వ్యవహరిస్తుండటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. దీని వల్ల సదరు సెలబ్రిటీలకు కూడా చెడ్డపేరు వస్తుందనే విషయాన్ని వేరే చెప్పనక్కర్లేదు.
