ఎన్నో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు నిరాశను మిగిల్చాయి. వీటి కోసం మరో నాలుగైదు రోజులు నిరీక్షించాల్సిందే. హఠత్తుగా నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఈ పరిస్ధితి మారి రుతుపవనాలు బలపడాలంటే అరేబియా తీరం వెంట కాని, బంగాళాఖాతంలో కాని ఓ అల్పపీడనం రావాలని వాతావరణ శాఖ అధికారుల చెబుతున్నారు.
ఇది కాకపోయినా ఉపరితల ఆవర్తనం ఏర్పడితే రుతుపవనాల వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఏటా రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజుల్లోగా రాయలసీమలో ప్రవేశిస్తాయి. ఈ నెల 8 వ తేదినే రుతుపవనాలు కేరళను తాకాయి. అయితే రెండు రోజుల్లోనే అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కర్నూలులో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే ఆ తర్వాత వాతావరణం అనుకూలించక బలహీన పడిన రుతుపవనాల రాక నిలిచిపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నాలుగైదు రోజుల్లో తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.