బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఇంగ్లాండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ (The Hundred) టోర్నమెంట్లో పూర్తి స్థాయిలో పాల్గొనడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అందుకున్నాడు.
ఈ విషయాన్ని బీసీబీ అధికారులు శనివారం ధృవీకరించారు. జూలై 20 నుండి ఆగస్టు 20 వరకు అతనికి ఎన్ఓసీ మంజూరు చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం జూలై 21 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో అతను మొదటి నుండి చివరి వరకు అందుబాటులో ఉండనున్నాడు.
‘ది హండ్రెడ్’ 2026 ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు ముస్తాఫిజుర్‌ను 1,00,000 బ్రిటీష్ పౌండ్ల (GBP) బేస్ ప్రైస్‌కు సొంతం చేసుకుంది. దీనితో ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడనున్న తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ రికార్డు సృష్టించబోతున్నాడు. “ది హండ్రెడ్ టోర్నీ కోసం అతనికి ఒక నెల రోజుల పాటు ఎన్ఓసీ ఇచ్చాం,” అని ఒక బీసీబీ అధికారి తెలిపారు.
జింబాబ్వేతో బులవాయోలో జూలై 15, 17, 19 తేదీల్లో జరగబోయే మూడు టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత.. పర్వేజ్ హుస్సేన్ ఎమొన్ ‘గ్లోబల్ సూపర్ లీగ్’ (GSL) ఆడటానికి కూడా బీసీబీ అనుమతి ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) గత ఎడిషన్‌లో తను ప్రాతినిధ్యం వహించిన లాహోర్ ఖలందర్స్ జట్టు…ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న గ్లోబల్ సూపర్ లీగ్ కోసం ఎమొన్ను ఎంపిక చేసుకుంది.
బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ వైటాలిటీ బ్లాస్ట్ (Vitality Blast) గ్రూప్ స్టేజ్‌లో కెంట్ స్పిట్‌ఫైర్స్ (Kent Spitfires) ఆడబోయే చివరి మూడు మ్యాచ్‌లలో భాగం కానున్నాడని కెంట్ క్రికెట్ శనివారం స్పష్టం చేసింది. ఈ వేసవిలో కెంట్ తరఫున ఆడిన రెండు రోథ్సే కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లలో హసన్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో బ్లాక్‌పూల్‌లో లంకాషైర్పై సాధించిన 6/69 మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కూడా ఉంది.
బంగ్లాదేశ్ టెస్ట్ జట్టులో క్రమం తప్పకుండా ఆడే హసన్ మహమూద్, వైటాలిటీ బ్లాస్ట్ ముగిసిన తర్వాత ఆగస్టులో ఆస్ట్రేలియాతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రయాణం కానున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ పూర్తయ్యాక, సెలెక్ట్ అయితే కెంట్ తరఫున మరో నాలుగు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడేందుకు అతను తిరిగి ఇంగ్లాండ్ రానున్నాడు.
