పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమై, ఆగస్టు 13 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై ఉభయ సభలలోనూ అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన తర్వాత, ఉభయ సభలను సమావేశపరచాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న కిరణ్ రిజిజు వెల్లడించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాల కోసం 2026 జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీలలో చీలికలు వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవి కావడం విశేషం. ఆ పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ సభ్యులలో 20 మంది తిరుగుబాటు చేసి, అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ పరిణామాలు లోక్‌సభలో ఎన్డీయే బలాన్ని మరింత పెంచాయి. అయితే, తిరుగుబాటు చేసిన టీఎంసీ, యూబీటీ సభ్యులను ప్రత్యేక గ్రూపులుగా గుర్తించాలనే డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు, ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రాజ్యసభలోనూ ఎన్డీయే బలం పుంజుకుంది.
గత బడ్జెట్ సమావేశాలలో ‘రాజ్యాంగ సవరణ బిల్లు’ లోక్‌సభలో ఆమోదం పొందకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. ఆ బిల్లును ప్రభుత్వం ఈ సమావేశాలలో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.ఇదే సమయంలో ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి పలు అంశాలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధమవుతోంది.
ముఖ్యంగా నీట్ (NEET) రీ-ఎగ్జామినేషన్ వివాదం,టీఎంసీ, శివసేన (UBT) పార్టీల చీలికల వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరే అవకాశం ఉంది.అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో గత మూడు నెలలుగా మధ్యప్రాచ్యంలో గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బతీసిన ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలను తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది.
