కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నర్సింహ విలేకరులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. బుధవారం నాడు మెదక్ లో జరిగిన ఓ సమావేశంలో రాజనర్సింహ స్ధానికి విలేకరులను దుర్భాషలాడడమే కాకుండా వారిపై అనుచరులతో దాడి కూడా చేయించారు. ఈ దాడిలో పలువురు విలేకరులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
గురువారం నాడు సంగారెడ్డిలో జరిగిన సోనియా గాంధీ విధేయత సభలో జర్నలిస్టులు రాజనర్సింహ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడున్న మాజీ మంత్రులు జగ్గారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తమ నాయకుడు రాజనర్సింహ ఎట్టి పరిస్దితుల్లోనూ క్షమాపణలు చెప్పరని అన్నారు. దీంతో అటు జర్నలిస్టులు, ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఒకరిద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు జర్నలిస్టులపైకి దూసుకొచ్చారు. దీంతో సమావేశం జరిగిన చోట గందరగోళం నెలకొంది. విలేకరులకు సర్దిచెప్పేందుకు పార్టీ నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు గాంధీ భవన్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జర్నలిస్టులు బహిష్కరించారు. దీంతో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క కల్పించుకుని శుక్రవారం నాడు ఈ సమస్యకు పరిష్కారిస్తామని అన్నారు.