ఇంటి వాడైన లాడెన్ కొడుకు…పెల్లికూతురు నాటి హైజాక‌ర్ కుమార్తే వ‌ధువు

ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసమా బిన్‌ లాడెన్‌ తనయుడు హంజా బిన్‌ లాడెన్‌ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబం ప్రకటించింది. 9/11 దాడులకు నేతృత్వం(లీడ్‌ హైజాకర్‌) వహించిన మహ్మద్‌ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ‘ది గార్డియన్’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ కుటుంబీకులు వెల్లడించారు.

ప్రస్తుతం తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నాడని, అయితే, అతనితో తమకు సంబంధాలు లేవని వారు వ్యాఖ్యానించారు. అల్ ఖైదా ద్వారా ప్రతీకార దాడులకు దిగవద్దని తాము హంజాను కోరుతున్నామని చెప్పారు.

హంజా ఆచూకీని తెలుసుకునేందుకు యూఎస్, బ్రిటన్ తదితర దేశాల నిఘా సంస్థలు గత రెండేళ్లుగా తమవంతు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, హంజా ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ లో నివాసం ఉంటున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం జనవరిలో హంజాను అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసింది.