చనిపోయిన తరవాత కూడా ఎవ్వరికీ నిద్ర లేకుండా చేస్తున్నాడు నరరూప హంతకుడు నయీం. తెలంగాణా పోలీసులు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో కొత్త చిచ్చు రేగింది. నయీం కేసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీస్ ఉన్నతాదికారులనీ హోం శాఖ కీ ఇది దూరాన్ని పెంచుతోంది.
నయింతో రాజకీయ నేతలకు.. పోలీసు అధికారులకు ఎలాంటి సంబంధాలు లేవంటూ కొద్దిరోజుల క్రితం దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు కొందరు తీవ్రమైన అసంతృప్తిని.. అసహనాన్ని వ్యక్తం చేయటమే కాదు.. హోంశాఖపై చిందులు తొక్కుతున్నారు. వాస్తవానికి తమకు తెలీకుండానే హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసిందని.. కేవలం సంతకాల కోసం మాత్రమే ఈ అఫిడవిట్ వచ్చిందన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.
నయిం కేసును విచారిస్తున్న అధికారులు సైతం.. నయింపై దాఖలు చేసిన ప్రభుత్వ పిటీషన్ ఏమాత్రం సబబు కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఫిడవిట్ కు సంబంధించిన కనీస సమాచారం కూడా తమకు లేదని.. మీడియాలోకి వచ్చిన తర్వాత మాత్రమే విషయం తెలిసిందని వాపోతున్నారు. నయిం ఎన్ కౌంటర్ అనంతరం.. అతడితో కొందరు రాజకీయ నేతలకు.. పోలీసు ఉన్నతాధికారులకు మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. ఈ పరిణామం విపక్ష నేతల మెడకు చుట్టుకుంటుందని భావించినా.. అధికారపక్ష నేతలకూ భాగస్వామ్యం ఉందన్న వాదన వినిపించింది.