డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో, సైబర్ మోసాల బారిన పడుతున్న సాధారణ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక పెద్ద ఊరటనిచ్చింది. దేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు మరియు నష్టపోయిన వినియోగదారులను ఆదుకునేందుకు ఆర్బీఐ ఒక సరికొత్త కస్టమర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది.
ఈ నూతన నిబంధనల ప్రకారం ఆన్లైన్ లేదా ఎలక్ట్రానిక్ మోసాల కారణంగా రూ. 50,000 లోపు నష్టపోయిన వినియోగదారులు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారులు పరిహారం పొందడానికి అర్హులు. బాధితులకు జరిగిన నికర నష్టంలో 85 శాతం వరకు లేదా గరిష్టంగా రూ. 25,000 వరకు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని పరిహారంగా తిరిగి చెల్లిస్తారు. అయితే ఒక వ్యక్తి తన జీవితకాలంలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ఈ విప్లవాత్మక మార్పులు 2027 జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలులోకి రానున్నాయి.
ఈ పరిహార సదుపాయాన్ని పొందడానికి ఆర్బీఐ కాలపరిమితితో కూడిన కఠినమైన నిబంధనలను విధించింది. మోసానికి గురైన కస్టమర్లు ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (హెల్ప్‌లైన్ నంబర్: 1930) లో గానీ లేదా తమ సంబంధిత బ్యాంకులో గానీ కచ్చితంగా ఫిర్యాదు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మోసం జరగడంలో కస్టమర్ల తప్పు ఏమీ లేకుండా, బ్యాంకు వైపు ఉన్న సాంకేతిక లోపాలు లేదా థర్డ్ పార్టీ భద్రతా లోపాల వల్ల గనుక నష్టం వాటిల్లితే కస్టమర్లపై ఎలాంటి బాధ్యత ఉండదు. అంటే అటువంటి సందర్భాల్లో నష్టపోయిన పూర్తి మొత్తాన్ని సదరు బ్యాంకులే కస్టమర్ ఖాతాకు తిరిగి రీఫండ్ చేయాల్సి ఉంటుంది.
ఇకపై ఆన్లైన్ మోసాల కేసులను బ్యాంకులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేకుండా ఆర్బీఐ టైమ్ డెడ్‌లైన్‌ను కూడా ఖరారు చేసింది. దేశీయంగా జరిగిన డిజిటల్ మోసాల దర్యాప్తును బ్యాంకులు ఫిర్యాదు అందిన 45 రోజుల్లోగా…అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన మోసాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేసి బాధ్యత ఎవరిదో తేల్చాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి కాకపోతే, అందుకు గల కారణాలను బ్యాంకులు కస్టమర్లకు లిఖితపూర్వకంగా వివరించడం తప్పనిసరి. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలపై మధ్యతరగతి మరియు అట్టడుగు వర్గాల ప్రజలకు నమ్మకం మరింత బలపడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
