అంచనాలు సరైనవే అని తేలుతున్న వేళలో ఉహాగానాలు అన్నీ నిజాలుగా మారిపోతున్నాయి. జయలలిత చేతిలోంచి చిన్నప్ప శశికళ ముఖ్యమంత్రి పీఠం లాక్కోవడం చాలా త్వరలో జరగబోతోంది అంటున్నారు. ఇందుకు డేట్ కూడా డిసైడ్ చేసినట్లేనని తెలుస్తోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి చిన్నమ్మ తహతహలాడుతున్న వైనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీ సంప్రదాయం ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించే వారే.. సీఎం కుర్చీలో కూర్చోవాలి. ఆ లెక్కన చిన్నమ్మే సీఎం అని వేరుగా చెప్పాల్సిన అవసరం లేనట్లే. ఇంతకాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న అన్నాడీఎంకే నేతల మాటలకు మరో ఎంపీ తన మద్దతు ఇవ్వటమే కాదు.. సీఎం పదవిని ఎప్పుడు చేపడతారన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి.
పార్టీ ఎంపీ కమ్ అధికార ప్రతినిధి అయిన మైత్రేయన్ ఒక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నమ్మ సీఎం కావటానికి తాము ఎవ్వరం అడ్డు చెప్పమని.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టటం అంతా ఆమె ఇష్టంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్న విషయం ఒక అధికారి వెల్లడించారు కదా? అన్న ప్రశ్నకు అవునని చెప్పారు.