మంచిర్యాల జిల్లా కేంద్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుని స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఐబీ చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న స్కూటీలో పాము దూరడంతో కలకలం రేగింది. ఇంటి బయట నిలిపిన స్కూటీలోకి పాము దూరినట్లు గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పామును బయటకు తీసేందుకు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ దాదాపు రెండు గంటల పాటు ప్రయత్నించినా పాము బయటకు రాలేదు. దీంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరకు బైక్ మెకానిక్‌ను పిలిపించి స్కూటీ భాగాలను విడదీశారు. అనంతరం లోపల దాగి ఉన్న జెర్రిపోతు పామును స్నేక్ క్యాచర్ సురక్షితంగా బయటకు తీశాడు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు భయాందోళన నెలకొంది. వేసవి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయని, వాహనాలు వాడే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
