ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం.. చాలా గొప్పగా చేయబోతున్నాం.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొంటూ.. భద్రతా ఏర్పాట్లు చేశాం.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావ్వివ్వం..
అంటూ ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు అయితే చేసింది కానీ… తీరా పుష్కర ముహూర్తం మొదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రభుత్వ చర్యలు ఏమిటో స్పష్టం అయ్యింది. పుష్కర నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలం అయ్యింది. పుష్కరాలు మొదలైన తొలిగంటలోనే దారుణం చోటు చేసుకోవడం.. తీవ్రమైన తొక్కిసలాటలో.. ఏకంగా మూడువందల మంది గాయపడటం ప్రభుత్వ, అధికారుల వైఫ్యలాన్ని సాక్ష్యంగా మారింది.
క్షతగాత్రుల్లో ఇప్పటి వరకూ పాతిక మందికి పైనే మరణించారు. సంఘటనాస్థంలోనే చాలా మంది మరణించగా.. మరికొంతమంది ఆసుపత్రిలో మరణించారు. తొక్కిసలాటలో గాయపడి.. చాలా మంది అక్కడిక్కడే స్పృహకోల్పోయారు. వీరిని ఆసుపత్రికి తరలించడానికి సరైన వాహన సదుపాయం కూడా లేకపోయింది. అంబులెన్స్ లు అందుబాటు లేవు. ఇంత పెద్ద వేడుకలో.. కోట్ల మంది హాజరవుతారనే కార్యక్రమానికి ముందస్తుగా కనీసం అంబులెన్స్ లు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
ఈ విషాదకరమైన ఘటనలో ప్రభుత్వాన్ని నిందించడం కాదు కానీ… ఏర్పాట్లలో.. నిర్వహణలో వైఫల్యం వల్లనే ఇలాంటి సంఘటన నమోదైందని చెప్పవచ్చు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఉత్తరాదిన దైవ స్థానాల వద్ద ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి. మరి అలాంటి సంఘటనల నుంచి పాఠం నేర్వని ప్రభుత్వాలు ఏర్పాట్లలో విఫలం అయ్యాయి. దీంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి.