ఇది ఒకప్పటి భారత్ కాదు.. అని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఇండియా. మేము చోరబడగలం.. హతమార్చగలం మరోసారి రుజువు చేసింది. మీరు ఒక్కరి ప్రాణం తీస్తే మేము శాంతి చర్చలు జరిపేది లేదు.. పది మంది ప్రాణం తీసేస్తాం అని గతంలో చేసిన ప్రకటనలను తు.చ. తప్పకుండా ఆచరించి చూపింది. ఉరి ఉగ్రదాడికి గ్రౌండ్ ఫోర్స్‌తో ఉగ్రవాదులను దెబ్బతిస్తే.. పుల్వామా దాడికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ ఛాన్స్ కొట్టేసింది.
ఎల్ఓసీ వెంట ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని .. భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. 12 మిరేజ్-2000 యుద్ధ విమానాలతో .. ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేశారు. ఎల్వోసీ దాటి ఈ దాడి చేయడం .. సర్జికల్ దాడి తర్వాత రెండవ సారి. సుమారు వెయ్యి కిలో బాంబులతో ఈ దాడి చేశారు. మంగళవారం ఉదయం 3.30 నిమిషాలకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐఏఎఫ్ కానీ డిఫెన్స్ శాఖ కానీ ఇంత వరకు ద్రువీకరించలేదు. కానీ తమపై దాడి జరిగినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ముజఫరాబాద్ సెక్టర్‌లో భారత వైమానిక దళాలు చొరబడ్డాయన్నారు.
సర్జికల్ స్ట్రయిక్స్ లో సుమారు 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. పీఓకేలోని బాలాకోట్, ముజఫరాబాద్ శివార్లలో ఉన్న శిబిరాల్లోని 3 కంట్రోల్ యూనిట్లపై 200కు పైగా బాంబులను జారవిడిచారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్స్.
అయితే ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టు కాదని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. భారత్‌లో భాగమైన కశ్మీర్‌లో దాడులు జరిగాయి తప్ప.. పాకిస్తాన్‌లో కాదని ఆయన తెలిపారు.