పాకిస్థాన్‌పై భారత్ మరో సారి సర్జికల్ స్ట్రైక్ దాడులు జరిపిందా…? పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాన్ గొంతు కోసి కిరాతకంగా హతమార్చినందుకు.. భారత బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయా…? హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు దేశంలో సంచలనంగా మారాయి.
సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు దగ్గర నరేంద్ర సింగ్ అనే జవాన్‌ను పాక్ బలగాలు హతమార్చిన విషయమై రాజ్‌నాథ్ స్పందించారు. పాకిస్థాన్‌పై మరోమారు సర్జికల్ దాడులు జరిపినట్టు పరోక్షంగా వెల్లడించారు. ఏం జరిగిందో చెప్పలేను కానీ ఏదో ఒకటి మాత్రం జరిగిందని అన్నారు. రెండు మూడు రోజుల క్రితమే అది సవ్యంగా జరిగిందని పేర్కొన్నారు. అదేంటనేది కొందరికి మాత్రమే తెలుసని, అసలేం జరిగిందనే విషయం మరికొన్ని రోజుల్లో అందరికీ తెలుస్తుందని పరోక్షంగా వెల్లడించారు.
ముజఫర్‌నగర్‌లో భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘పాకిస్థాన్ మన పొరుగు దేశం, మొదటి బుల్లెట్‌ను మనం కాల్చొద్దని బీఎస్ఎఫ్ జవాన్లకు చెప్పాను. కాల్పులు ప్రారంభమైతే మాత్రం గట్టిగా తిప్పికొట్టండి, ఎన్ని బుల్లెట్లు కాల్చామో లెక్కించొద్దని చెప్పా’నని తెలిపారు.
రాజ్‌నాథ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పాకిస్థాన్‌పై మరోమారు సర్జికల్ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ మన పొరుగు దేశమని, వారిపై కాల్పులు జరపొద్దని సైన్యానికి తాను చెప్పినట్టు మంత్రి తెలిపారు. ఒకవేళ వారు కనుక మనపైకి వస్తే మాత్రం బుల్లెట్ల లెక్క చూసుకోకుండా విరుచుకుపడాలని సూచించినట్టు రాజ్‌నాథ్ తెలిపారు.
తమ జవాన్ హత్యకు ప్రతీకారంగా జరిపిన దాడుల్లో పాకిస్థాన్‌కు గణనీయంగా నష్టం వాటిల్లిందని బీఎస్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి.