బంగ్లాదేశ్ రచయిత్రి, సామాజిక కార్యకర్త తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల (సరిగ్గా 18 సంవత్సరాల 8 నెలల 10 రోజుల) సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె, తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నగరం నన్ను ఆత్మీయంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది, అందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు.
1994 నుండి దేశ బహిష్కరణలో జీవిస్తున్న తస్లీమా నస్రీన్, ఓస్మాన్ గని మల్లిక్ నేతృత్వంలోని ‘సెక్యులర్ మిషన్’ అనే సంస్థ ఆహ్వానం మేరకు కోల్‌కతాకు వచ్చారు. విమానాశ్రయం వద్ద సెక్యులర్ మిషన్ అధ్యక్షుడు ఓస్మాన్ గని మల్లిక్ మరియు బిజెపి ఎమ్మెల్యే సౌరవ్ సిక్దర్ ఆమెకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఓస్మాన్ గని మల్లిక్ మాట్లాడుతూ 2003లో ప్రచురించిన తస్లీమా పుస్తకం ‘ద్విఖండితో’ వివాదాస్పదం కావడంతో 2007లో కొందరు తీవ్రవాద శక్తుల నిరసనల మధ్య ఆమె భారమైన హృదయంతో కోల్‌కతా వదిలి వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
తమ ప్రియతమ రచయిత్రిని ఎంతో గౌరవంతో మళ్లీ కోల్‌కతాకు తీసుకురాగలిగామని, ఇది తమకు అత్యంత సంతోషకరమైన రోజని చెప్పారు. ఈ సందర్శనకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసి సహకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి మల్లిక్ ధన్యవాదాలు తెలిపారు. తన కోల్‌కతా పర్యటన వెనుక బిజెపి ఉందంటూ వస్తున్న ఆరోపణలను తస్లీమా నస్రీన్ తీవ్రంగా ఖండించారు. జూలై 19న ‘X’ (ట్విట్టర్)లో ఆమె పెట్టిన పోస్ట్‌ను ప్రస్తావిస్తూ …నన్ను కోల్‌కతాకు బిజెపి తీసుకువస్తోందా? లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకువస్తోందా? లేదు. ‘సెక్యులర్ మిషన్’ అనే సంస్థ నన్ను ఆహ్వానించింది. నేను ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నాకు భద్రత కల్పించడం ఆ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా బాధ్యత. నా రెండు రోజుల పర్యటనపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అన్నారు.
