ఫార్ములా-ఈ రేసు అక్రమాల కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ విచారణలో కేటీఆర్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి కూడా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ వాదన తో కేటీఆర్ న్యాయవాదులు విభేదించారు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ నిధుల మళ్లింపు మరియు అక్రమాల ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టులో పూచీకత్తుల సమర్పణ ప్రక్రియ పూర్తయిన అనంతరం, న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా కోర్టుకు రావడం, విచారణ వాయిదా పడటంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ, సచివాలయ ప్రాంగణంలోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే విచారణలో ఏసీబీ ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుందోనన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది. విచారణ అనంతరం కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది.
ఈ ఆరోపణలన్నింటినీ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి, ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ నిర్వ హించామని తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతి, రహస్య ఒప్పందాలు జరగలేదని.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే తమపై ఈ రకమైన “లొట్టపీసు” కేసులు బనాయిస్తోందని కొట్టిపారేశారు. ఛార్జ్‌షీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించడంతో, ఆగస్టు 25న జరగబోయే తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
