- Advertisement -

మంత్రివర్గ ప్రక్షాళనపై ముగియని ఉత్కంఠ!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర మంత్రివర్గంలో జరగబోయే మార్పులు, చేర్పులపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హస్తినకు పయణమయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దిల్లీలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశమైన మంత్రి కొండా సురేఖ కూడా అక్కడే మకాం వేయడం గమనార్హం.

మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. లోధీ ఎస్టేట్‌లోని కేసీ నివాసంలో దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కోరినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ లోపించకుండా ఉండాలంటే తక్షణ చర్యలు అనివార్యమని రేవంత్‌రెడ్డి గట్టిగా వాదించినట్లు తెలిసింది.

మరోవైపు సురేఖ దిల్లీలోనే ఉండటంతో, అధిష్టానం ఎదుట తన వాదనను వినిపించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమశిక్షణా చర్యలతో పాటు మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపై కూడా పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాతే కేబినెట్ ప్రక్షాళనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఖాళీ అయ్యే స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. లంబాడా వర్గానికి కేటాయిస్తే రామచంద్రునాయక్ పేరు రేసులో ఉంది. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో చర్చల తర్వాతే తుది నిర్ణయం వెలువడనుంది. బుధవారం జరిగే సమావేశాలు ఈ కేబినెట్ రాజకీయంలో అత్యంత కీలకం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -