దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’. యశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ చిత్రబృందం తాజాగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
‘లేడీస్ అండ్ లేడీస్’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో ఐదుగురు కథానాయికలు సరికొత్త లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. నయనతార గంగ పాత్రలో షార్ట్ హెయిర్ లుక్‌లో బైక్‌పై యాక్షన్ సీక్వెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. రుక్మిణి వసంత్ మెలిసా పాత్రలో గన్‌తో పవర్‌ఫుల్‌గా కనిపించారు. నదియా పాత్రలో కియారా అడ్వాణీ గ్లామరస్ లుక్‌తో అలరించారు. రెబెకాగా తారా సుతారియా రహస్య ఏజెంట్ తరహా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఎలిజిబెత్ పాత్రలో హ్యుమా ఖురేషీ తన బాడీ లాంగ్వేజ్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.
వీడియో చివరలో యశ్ “ఒక్కొక్కరుగా వస్తారా.. ఒకేసారి వస్తారా” అంటూ చెప్పిన డైలాగ్, ఆయనకు ఈ ఐదుగురు భామలకు మధ్య పోరు ఉండబోతోందని స్పష్టం చేస్తోంది. హై-ఇంపాక్ట్ యాక్షన్ అవతార్‌లో యశ్ మరోసారి తనదైన శైలిలో కనిపించారు.
సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ఈ వీడియో మరోవైపు వివాదానికి దారితీస్తోంది. గత టీజర్‌లో మాదిరిగానే ఈ వీడియోలోనూ కొన్ని శృంగారభరితమైన సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ ఉండటంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వీడియో చివరలో ఉన్న కొన్ని డైలాగ్స్ అశ్లీలతను తలపిస్తున్నాయని, వాటిని మ్యూట్ చేయకుండా విడుదల చేయడంపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
