ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాలుగేళ్లకు పైగా భీకరంగా కొనసాగుతోంది. ఎటువైపు విజయం స్పష్టంగా కనిపించకుండా రెండు దేశాలు సుదీర్ఘ పోరాటం సాగిస్తున్నాయి. రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక సహాయంపైనే ఆధారపడుతోంది. అయితే ఇప్పుడు సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు ఉక్రెయిన్ ఒక వినూత్నమైన, వివాదాస్పద ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని చట్టబద్ధం చేయాలని యోచిస్తోంది.
పోర్నోగ్రఫీని లీగల్ చేయాలంటూ ఉక్రెయిన్ చట్టసభ్యుడు యారోస్లావ్ పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అడల్ట్ ఇండస్ట్రీని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా భారీగా పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని ఆయన వాదిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు 25 మిలియన్ డాలర్ల మేర ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఆ నిధులతో ఏకంగా 30 వేల డ్రోన్లను కొనుగోలు చేసి రష్యాపై యుద్ధంలో ఉపయోగించవచ్చని ఆయన చెప్తున్నారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ చట్టాల ప్రకారం పోర్నోగ్రఫీని సృష్టించడం, పంపిణీ చేయడం, అశ్లీల వీడియోలను కలిగి ఉండటం పూర్తిగా నేరం. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కేసుల తీవ్రతను బట్టి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ, దేశంలో చాటుమాటుగా అడల్ట్ ఇండస్ట్రీ నిశ్శబ్దంగా విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు యుద్ధ ఖర్చుల కోసం దీన్ని లీగల్ చేయాలనే ప్రతిపాదన తెరపైకి రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఒకవైపు దేశాన్ని రక్షించుకోవడానికి నిధుల అవసరం ఉందని, మరోవైపు నైతిక విలువలు అడ్డు వస్తున్నాయని ఈ చర్చ జరుగుతోంది. యుద్ధం కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలుపుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇది అమలైతే యుద్ధ వేళ నిధుల సేకరణకు ఇదొక కొత్త మార్గంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
