వివిధ దేశాలు, ఖండాల వైశాల్యాన్ని కచ్చితంగా చూపే సరికొత్త ‘ఈక్వల్ ఏరియా మ్యాప్’ (నిజ వైశాల్య ప్రపంచ పటం) వినియోగంపై ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి భారత్ తన మద్దతు తెలిపింది. అయితే ఈ మద్దతు ప్రపంచ పటంలో ఎలాంటి నిర్దిష్ట మార్పులకు గానీ, జాతీయ సరిహద్దుల చిత్రణకు గానీ ఆమోదం తెలిపినట్లు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ఐక్యరాజ్యసమితి చేసిన ఈ తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసిందని, అందుకు గల కారణాలను కూడా స్పష్టంగా వివరించామని ఆయన తెలిపారు. ఈ మద్దతు అంతర్జాతీయ సరిహద్దులు, వివాదాస్పద భూభాగాలు లేదా ప్రదేశాల పేర్లతో సహా రాజకీయ ఉద్దేశాలతో మార్పులు చేసిన పటాల గురించి ప్రస్తావించదని తేల్చిచెప్పారు.
జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సార్వభౌమ భూభాగాలను భారతదేశ అధికారిక పటం ప్రకారమే చూపించాలని, దీనికి విరుద్ధంగా తప్పుదారి పట్టించే చిత్రీకరణ ఏదీ ఆమోదయోగ్యం కాదని జయస్‌వాల్ స్పష్టం చేశారు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై భారత్ వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలు, ఖండాల వైశాల్యాన్ని కచ్చితంగా ప్రదర్శించే సరికొత్త ‘ఈక్వల్ ఏరియా మ్యాప్’ను ఐరాస ఆమోదించడంతో, 16వ శతాబ్దం నుంచి అమల్లో ఉన్న పాత ‘మర్కేట ప్రపంచ పటం’ కనుమరుగైంది. నౌకాయానం కోసం నాటి కాలంలో రూపొందించిన మర్కేట పటాన్ని కాలం చెల్లినదిగా ఐరాస ప్రకటించింది.
ఈ కొత్త పటంలో భారత్, ఆఫ్రికా ఖండాలు పెద్దవిగా కనిపించనుండగా, అమెరికా కొంత చిన్నదిగా చూపించనుంది. ఇది కేవలం పటంలో కనిపించే భౌగోళిక నిష్పత్తి మార్పు మాత్రమేనని, దేశాల వాస్తవ సరిహద్దుల్లో ఎటువంటి మార్పులు ఉండవని ఐరాస పేర్కొంది. ప్రపంచ పటాన్ని మరింత కచ్చితంగా, శాస్త్రీయంగా చూపే ఈ కొత్త విధానాన్ని ప్రామాణికంగా ప్రకటిస్తూ ఐరాస ఈ కీలక తీర్మానాన్ని ఆమోదించింది.
