Saturday, May 10, 2025
- Advertisement -

హరికృష్ణ నక్కను ఎందుకు పెంచారంటే..

- Advertisement -

నందమూరి కుటుంబానికి సెంటిమెంట్లు ఎక్కువే. తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం, జాతకాలు, ముహూర్తాలు, చేతికి, మెడలోకి వివిధ రకాల హారాలు, రుద్రాక్షలు, పూజలు, హోమాలు, వ్రతాలు అన్నీ చేస్తుంటారు. తండ్రి ఎన్టీఆర్ నుంచే వారికి ఈ సంప్రదాయం వచ్చింది. అందుకే బాలకృష్ణ, హరికృష్ణ సహా ఎన్టీఆర్ వారసులు వివిధ రకాల ఉంగరాలు, మెడలో హారాలు, ముంజేతికి రకరకాల కడియాలు ధరిస్తుంటారు. వీటితో పాటు హరికృష్ణకు పశుపక్షాదులంటే మహా ఇష్టం. ఆయన పుట్టిన కృష్ణా జిల్లా నిమ్మకూరులోనే 20 ఏళ్లు వచ్చేవరకూ గడిపారు. ఆ టైంలో పల్లెటూరి సరదాలన్నీ తీర్చుకునేవారు. అదే సమయంలో ఆవులు, గేదెలు, పాడి పంటలు అంటే బాగా మక్కువ పెంచుకున్నారు. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ కు వెళ్లిపోయినా, వాటిపైన ఇష్టం ఏమాత్రం తగ్గలేదు. ఆయన హైదరాబాద్ లోని తన హోటల్ తో పాటు, నివాసం, నిమ్మకూరులోని నివాసంలోనూ, ఫామ్ హౌస్ లో వివిధ రకాల పక్షులు, కోళ్లు, ఆవులు, గేదెలు, కుందేళ్లు, జంతువులను పెంచుకునేవారు. వాటితో పాటు ఓ నక్కను కూడా పెంచేవారని సన్నిహితులు చెబుతున్నారు. ప్రతిరోజూ నక్క ముఖం చూస్తే మంచి జరుగుతుందని హరికృష్ణ విశ్వసించేవారట. నక్క మొకం చూడటం వల్ల పలు దోషాలు కూడా తొలగిపోతాయని ఎవరో సిద్ధాంతి చెప్పడంతో అప్పటి నుంచి నక్కను పెంచేవారని తెలిసింది.

రెండు వారాల క్రితం తనకు మంచి డ్రైవర్ ను ఏర్పాటు చేయాలని బోధన్ కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అమర్ నాథ్ ను హరికృష్ణ కోరడంతో ఆయన ఓ కుర్రాడిని అతడి వద్దకు పంపారు. ఆ యువకుడి బయోడేటాతో పాటు జన్మనక్షత్రం, జాతకం, రాశి హరికృష్ణ పరిశీలించారు. ఆ యువకుడు జాతకరీత్యా కుదురుగా ఓ చోట ఉండడని, స్థిరత్వం ఉండదని భావించిన హరికృష్ణ కొద్ది రోజుల తర్వాత రమ్మని తిరిగి పంపేశారట. మళ్లీ వచ్చిన యువకుడికి హైవేలో 100 కిలోమీటర్ల లోపు, సిటీలో 80 కిలోమీటర్ల లోపు డ్రైవింగ్ చేయాలని, అంతకుమించి వేగం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని కండిషన్ పెట్టారు. దానితో తనను ఇంటికి డ్రాప్ చేశాక, అబిడ్స్ లోని తన హోటల్ లోనే ఆ డ్రైవర్ ను బస చేయాలని సూచించారు. ఆ కండిషన్స్ నచ్చని యువకుడు డ్యూటీలో చేరలేదని తెలిసింది.

హరికృష్ణతో పాటు ప్రమాదానికి గురైనా, ప్రాణాలతో బయటపడిన రావి వెంకటరావు, శివాజి కృష్ణా జిల్లావారే. వీరిలో వెంకట్రావు కృష్ణా జిల్లా మోపిదేవికి చెందినవారు. ఆయనకు హైదరబాద్ శివారులో డెయిరీ ఫాం ఉంది. అందులో గేదెలు, ఆవులు, పెద్దఎత్తున పెంచుతున్నారు. ఓ సారి బ్రహర్షి విశ్వామిత్ర సినిమా కోసం ఓ ఆవు కావలిసి వస్తే, హరికృష్ణ ఆ డెయిరీ ఫాంకు వెళ్లి వెంకట్రావుతో తొలిసారి మాట్లాడారు. ఆవును తెచ్చి షూటింగ్ పూర్తి చేసుకుని, తిరిగి జాగ్రత్తగా అప్పగించేశారు. అప్పటి నుంచి వెంకట్రావుతో హరికృష్ణ పరిచయం బలమైన స్నేహంగా మారింది. ఎప్పటికప్పుడు హరికృష్ణ ఆ డెయిరీ ఫాంకు వెళ్లి ఆవులు,గేదెల మధ్య గడుపుతూ, వాటికి ఆహారం అందిస్తూ, నిమ్మకూరులో తాను గడిపిన బాల్యాన్ని గుర్తు చేసుకునేవారు. అప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్లాలన్నా వెంకట్రావును తోడుగా తీసుకువెళ్లటం హరికృష్ణకు అలవాటు. ప్రమాదం జరిగిన రోజు కూడా వెంకట్రావు కారు తాను నడుపుతాను ఇవ్వమంటే…టిఫిన్ చేశాక నడుపుదువులే, అంతవరకూ నేనే డ్రైవ్ చేస్తాను. అని హరికృష్ణ చెప్పారు. కానీ ఆఖరిసారి టిఫిన్ చేయకుండానే ఆయన తుదిశ్వాస విడిచారని నాటి జ్ఞాపకాలను చెప్పుకుంటూ వెంకట్రావు, సహా హరికృష్ణ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -