గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులను బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తల తెగిపడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బంధువుల్లో ఒకరు చనిపోవడంతో వారింట్లో జరిగే పెద్దకర్మకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెల్తే….బాపట్ల మండలం కంకటపాలెం గ్రామానికి చెందిన కలవకొల్లు గోపి(25), వీరనారాయణ ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏటిగడ్డ ఉప్పరపాలెంలో బంధువుల ఇంట్లో పెద్దకర్మ కార్యక్రమానికి ద్విచక్రవాహనంపై బయలు దేరారు.బాపట్ల-జమ్ములపాలెం రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో గోపి తల శరీరం నుంచి వేరై దూరంగా పడిపోయింది. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తలలేని మొండెం చూసి ఆందోళనకు గురయ్యారు. వెనుక కూర్చున్న వీరనారాయణకు స్వల్ప గాయాలే అయ్యాయి.బాపట్ల గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై రాజా ఘటనాస్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడ్డ వీరనారాయణను విచారించగా, పసుపు రంగులో ఉన్న బస్సు తమ వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయిందని చెప్పాడు.
గోపి మృతదేహం వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య త్రివేణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు యువకుడు శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణాలు మిగిలేవని పేర్కొన్నారు.